A tearful farewell with the joshers of the revolution || Gadara || Gaddar | భూమాత ఒడిలో వాలిపోయిన పొద్దు.. విప్ల‌వ జోహార్ల‌తో క‌న్నీటి వీడ్కోలు..

 

Gaddar | హైద‌రాబాద్ : పొడుస్తున్న పొద్దు అస్త‌మించింది.. ఆ పొద్దు ఇక సెల‌వంటూ భూమాత ఒడిలో వాలిపోయింది. క‌డ‌సారి చూపు కోసం బండెన‌క బండి క‌ట్టి త‌ర‌లొచ్చిన జ‌నం.. వాలిపోతున్న పొద్దుకు విప్ల‌వ జోహార్ల‌తో క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అంతిమ సంస్కారాలు బౌద్ధ సంప్రదాయం ప్ర‌కారం నిర్వ‌హించారు. గ‌ద్ద‌ర్ అమ‌ర్ ర‌హే అంటూ అభిమానులు నిన‌దించారు.

అల్వాల్‌లోని మ‌హోబోధి విద్యాల‌యంలో ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల‌తో గ‌ద్ద‌ర్ అంతిమ సంస్కారాలు ముగిశాయి. గ‌ద్ద‌ర్ అంత్య‌క్రియ‌ల‌ను ఆయ‌న పెద్ద కుమారుడు సూర్యుడు నిర్వ‌హించారు. మ‌హాబోధి విద్యాల‌యాన్ని గ‌ద్ద‌రే స్థాపించారు. ఇక గ‌ద్ద‌ర్ అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంగా ఆయ‌న భార్య విమ‌ల‌, కుమారుడు సూర్యుడు, కూతురు వెన్నెల బోరున విల‌పించారు. గ‌ద్ద‌ర్ అంత్య‌క్రియ‌ల నేప‌థ్యంలో మ‌హాబోధి విద్యాల‌యం జ‌న‌సంద్రంగా మారింది. అంతిమ సంస్కారాల‌కు రాజ‌కీయ నాయ‌కులు, మేధావులు, క‌వులు, క‌ళాకారులు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) ఆదివారం కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్‌ కొద్ది రోజుల కిందట గుండెపోటుతో దవాఖానలో చేరి చికిత్స పొందుతున్న ఆయనకు ఈ నెల 3న బైపాస్‌ సర్జరీ జరిగిందని, కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న గద్దర్‌ ఆరోగ్యం ఆదివారం మరింత క్షీణించింది. మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను సీఎం ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, చంటి క్రాంతి కిర‌ణ్‌, మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న‌, బీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు నివాళుల‌ర్పించారు.

JOIN

Post a Comment

కొత్తది పాతది