నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యం పెద్ద పులులకు ఆవాసంగా మారింది. దేశంలోనే రెండో అతిపెద్ద పులుల అభయారణ్యంగా పేరు న్న ఈ నల్లమల అడవిలో పెద్దపులులతో పాటు చిరుతలు, చుక్కల దుప్పులు, నెమళ్లు, సాంబార్లు, కణితి, మనుబోతులు, అడవి పిల్లులు, అడవి కుక్కలు, అడవి కోడి, ఎలుగుబంట్లు, మూషిక జింకలు, కోతులతో పాటుగా అడవి బర్రె ఉన్నాయి.

దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్
ఏటా పెరుగుతున్న సంఖ్య
ప్రస్తుతం 18 ఆడ, 12 మగ పెద్ద పులులు ఉన్నట్లు అంచనా
మూడు పిల్లలతో పర్హాబాద్ పరిసరాల్లో సంచరిస్తున్న ఎఫ్-23 పులి
నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం
మన్ననూర్, జూలై 28: నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యం పెద్ద పులులకు ఆవాసంగా మారింది. దేశంలోనే రెండో అతిపెద్ద పులుల అభయారణ్యంగా పేరు న్న ఈ నల్లమల అడవిలో పెద్దపులులతో పాటు చిరుతలు, చుక్కల దుప్పులు, నెమళ్లు, సాంబార్లు, కణితి, మనుబోతులు, అడవి పిల్లులు, అడవి కుక్కలు, అడవి కోడి, ఎలుగుబంట్లు, మూషిక జింకలు, కోతులతో పాటుగా అడవి బర్రె ఉన్నాయి. అటు క్రూర మృగాలు, ఇటు శాఖాహార జంతువులు, పాములు, పక్షులు దట్టమైన అటవీ సంపద, అడవిని ఆనుకొని కృష్ణానదీ పరివాహక ప్రాంతం నల్లమలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
2,166.37 చదరపు కిలో మీటర్ల మేర నల్లమల అడవి
అమ్రాబాద్ డివిజన్‌లో నల్గొండతో పాటు నాగర్‌కర్నూ ల్‌లోని కొల్లాపూర్, అచ్చంపేట డివిజన్లు కలుపుకొని 2,166.37 చదరపు కిలో మీటర్లలో నల్లమల అడవి విస్తరించి ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో కోర్ ఏరియా 1750, బఫర్ ఏరియా 445 చదరపు కిలో మీటర్లు ఉంది. 2020-22 టైగర్ సెన్సెస్ ప్రకారం అడవిలో 21 పెద్ద పులులు ఉన్నట్లుగా జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్‌టీసీఏ) ప్రక టించింది. వాటితో పాటు గడిచిన రెండేళ్లలో పాదముద్రలు, సీసీ ట్రాఫ్ కెమెరాల్లో నిక్షిప్తమైన పెద్ద పులులను బట్టి మరో తొమ్మిది పెద్ద పులులు కలుపుకొని 30(18 ఆడ, 12 మగ ) పెద్ద పులులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. కోర్ ఏరియాలో మనుషులు, పశువుల సంచారం నిషేధమని, బఫర్ ఏరియాలో పశువులను మేపుకోవచ్చని, ఇకో టూరిజం అభివృద్ధి చేసుకోవచ్చనని వైల్డ్ లైఫ్ నిబంధనలు విధించింది.
పెద్ద పులుల సంరక్షణకు ఎన్నో కార్యక్రమాలు
అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని పెద్ద పులుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. నాగార్జున సాగర్, అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని 14 అటవీ రేంజ్‌ల పరిధిలో బేస్ క్యాంపుల ద్వారా అటవీశాఖ పులుల సంరక్షణకు శ్రీకారం చుడుతోంది. అడవుల్లో శాకాహార జంతువులను పెంచడం, గడ్డి క్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటు నీటి వసతి కల్పిస్తోంది. అడవుల్లోని అన్ని బీట్లలో రేంజ్, సెక్షన్, బీట్ అధికారులను నియమించింది. వీరికి సహకారంగా ఉండేందుకు స్థానిక చెంచు, ఇతర స్థానిక యువకులను టైగర్ ప్రొటక్షన్ వాచర్లుగా ఏర్పాటు చేసింది. వారందరికీ నెలనెలా వేతనాలందిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. శ్రీశైలం హైదరాబాద్ రహదారి వెంట పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తిని వన్యప్రాణులు అనారోగ్యానికి గురవుతున్నట్లుగా గుర్తించిన అటవీ అధికారులు ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మన్ననూరు, దోమల పెంటల వద్ద గల టోల్ గేట్‌ల నుంచి వసూలు చేస్తున్న రుసుములను పర్యావరణ హిత కార్యక్ర మాలకు ఉపయోగిస్తున్నారు. పెద్దపులులతో పాటుగా ఇతర వన్యప్రాణులకు నిద్రాభంగం కలుగకుండా రోజూ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మన్ననూరు, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద వాహనాల నిషేధం కొనసాగుతోంది. యేటా పలు సందర్భాల్లో పర్యావరణ విజ్ఞానాన్ని అందించేందుకు పాఠశాల విద్యార్థులను అటవీ పర్యటనలకు తీసుకెళ్తున్నారు. వారికయ్యే వాహన, భోజన ఖర్చులను అటవీ శాఖనే భరిస్తోంది. పులులు, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల రక్షణపై విజ్ఞానాన్ని అందిస్తోంది. అడవిలోని జంతు వులను చూసేందుకు పర్యాటకులకు సఫారీ టూర్ అవకాశాన్ని కల్పిస్తోంది.
పులుల కదలికలపై ప్రత్యేక నిఘా
నల్లమలలో పులుల సంచారంపై అటవీశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో ప్లగ్‌మార్కులు(పాముద్రల) ఆధారంగానే పులుల సంఖ్యను లెక్కించేవారు. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికతను కలిగిన సీసీ ట్రాఫ్ కెమెరాలను అడవిలో చెట్లకు బిగించారు. ఏదైన అడవి జంతువు సంచరిస్తే ఆ చిత్రాన్ని కెమెరాలు బంధిస్తాయి. వీటిని విధుల్లో ఉండే సిబ్బంది ఎప్పటికప్పుడు ఎన్‌టీసీకి పంపిస్తారు. ఆయా బీట్లలో పనిచేసే బీట్ అధికారులు టైగర్ మూవ్‌మెంట్ ఫాంలో పులి పాదముద్రలు, వాటి పేడ, చెట్లకు ఉండే వెంట్రుకలు కనిపించినా ఫాంలో రిపోర్టు నింపి స్థానిక రేంజ్ కార్యాలయంలో సమర్పిస్తారు. ప్రతీ సాసర్ బిట్ వద్ద వన్యప్రాణులకు ఉప్పు బిస్కెట్లను అందుబాటులో ఉం చుతారు.
ఎక్కడో ఒక చోట గాండ్రింపులు
నల్లమల అభయారణ్యంలో పులుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందనడానికి పెద్ద పులుల సంచారమే నిదర్శనమని చెప్పొచ్చు. ఇటీవల వటవర్లపల్లి పరిసరాల్లో పెద్దపులి సంచరించింది. మూడు ఆవులను చంపివేసింది. తాజాగా పర్హాబాద్ వ్యూపాయింట్ వద్ద నిజాం రాజు పాత బంగ్లా నుంచి దోరాల వెళ్లే ప్రాంతంలో మూడు పిల్లలతో కూడిన ఎఫ్ 23 పులి ద్విచక్ర వాహనంపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దాంతో బైక్‌పై ఉన్న ఇద్దరు మహిళలు, యువకుడు తప్పించుకున్నారు. అడవిలో చిరుతలు సైతం భారీగా పెరిగాయి. అటు శాకాహార, క్రూర మృగాలతో నల్లమల అభయారణ్యం కళకళలాడుతోందని చెప్పొచ్చు. నల్లమలలోని పర్హాబాద్ ప్రాంతంలో సంచరించే పులులకు అటవీ శాఖ పర్హా, ఫరీదా, షేర్‌ఖాన్, ఎఫ్18, ఎఫ్23 అనే పేర్లు సైతం పెట్టారు. ఇలాంటి చర్యలు కొనసాగితే పెద్ద పులులకు నల్లమల అడవి సురక్షిత ప్రాంతంగా దేశంలోనే ప్రత్యేకత చాటుకునే అవకాశం ఉంది.
إرسال تعليق