వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి.. కొత్త కుర్రాళ్లను బరిలోకి దింపితే.. వారు అంచనాలను అందుకోలేకపోయారు.

బార్బడోస్: వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి.. కొత్త కుర్రాళ్లను బరిలోకి దింపితే.. వారు అంచనాలను అందుకోలేకపోయారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి 1-0తో ముందంజలో ఉన్న టీమ్‌ఇండియా.. శనివారం వర్షం అంతరాయం మధ్య సాగిన రెండో మ్యాచ్‌లో పేలవ ఆట తీరు కనబర్చింది. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌కు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. గత మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, ఒక సిక్సర్) మరోసారి హాఫ్‌సెంచరీతో మెరువగా.. శుభ్‌మన్ గిల్ (34) పర్వాలేదనిపించాడు. చాన్నాళ్ల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్ (9), అక్షర్ (1), పాండ్యా (7), సూర్యకుమార్ (24), జడేజా (10), శార్దూల్ (16) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్, మోతి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో కడపటి వార్తలు అందేసరికి విండీస్ 8.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో బలమైన జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తున్న టీమ్‌ఇండియా.. వెస్టిండీస్ పర్యటనతోనే మెగాటోర్నీ సన్నాహకాలు ప్రారంభించింది. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్‌పై ప్రధాన ఆటగాళ్ల అవసరం లేదనుకున్న టీమ్ మేనేజ్‌మెంట్.. రెండో వన్డేలో కోహ్లీ, రోహిత్‌కు రెస్ట్ ఇచ్చి వారి స్థానంలో సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. అయితే రాక రాక వచ్చిన అవకాశాన్నీ వీళ్లెవరూ సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. ఓపెనర్లు సత్తాచాటడంతో ఒక దశలో 90/0తో ఉన్న భారత జట్టు.. మరో 91 పరుగుల వ్యవధిలో పది వికెట్లు కోల్పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీల్లో రాణించిన ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున అదే స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయారు.
ప్రత్యర్థి జట్టులో ప్రచండ బౌలర్లు లేకపోయినా.. అనవసర షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. అథనాజ్ పట్టిన సూపర్ క్యాచ్‌కు ఇషాన్ ఇన్నింగ్స్‌కు తెరపడగా.. సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ తప్పుడు షాట్ సెలెక్షన్‌తోనే పెవిలియన్ బాటపట్టారు. ఇటీవల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఇంతకన్నా మెరుగైన ఆటగాళ్లు ఉన్న వెస్టిండీస్.. స్కాట్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్ల చేతిలోనూ ఓడి ఘోర అవమానం మూటగట్టుకుంది. అలాంటి జట్టుపై మన ఐపీఎల్ హీరోలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం మేనేజ్‌మెంట్‌ను కలవరపాటుకు గురిచేస్తున్నది. బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్, కోహ్లీ వంటి యాంకర్ రోల్ పోషించే వాళ్లు లేకపోతే మన వాళ్లు చేతులెత్తేయడం ఖాయమే అని ఈ మ్యాచ్‌తో నిరూపితమైంది. పిచ్ కష్టంగా ఉందని సర్దిచెప్పుకుందాం అనుకుంటే.. ఎంత కఠిన పిచ్‌పై అయినా.. ఈ తరహా ఆటతీరు మాత్ర అక్షేపణీయం కాదు. మెగాటోర్నీకి నిండా మూడు నెలలు కూడా లేని తరుణంలో మేనేజ్‌మెంట్ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. మ్యాచ్ ఆరంభానికి ముందు హార్దిక్ మాట్లాడుతూ.. ‘కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకాలనుకుంటున్నాం’ అని చెప్పనైతే చెప్పాడు కానీ.. మన ఇన్నింగ్స్ ముగిసే సరికి మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయనేది కాదనలేని వాస్తవం.
إرسال تعليق